అంతా గుడ్డి నమ్మకంతోనే.. రాజమౌళి సినిమాపై రాంచరణ్ షాకింగ్ కామెంట్స్..

మెగా పవర్‌స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న మల్టీస్టారర్ ప్రారంభానికి ముందే అనేక సంచలనాలు సృష్టిస్తున్నది. ఈ చిత్రంపై జరిగినంత చర్చ ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌లో జరుగలేదు. ఈ చిత్రం గురించి ఎలాంటి విషయాలు అధికారికంగా వెల్లడించకపోయినా.. అనేక రకాలైన వార్తలు మీడియాలో షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రంగస్థలం సినిమా ప్రమోషన్ సందర్భంగా రాంచరణ్ ఓ ఆసక్తికరమైన వార్తను వెల్లడించినట్టు ఓ ఆంగ్ల వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది. అదేమిటంటే..

ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్న చిత్రానికి సంబంధించిన సినిమా కథ ఏమిటో ఇప్పటి వరకు నాకు తెలియదు. స్క్రిప్టు ఇంకా నా వద్దకు రాలేదు. రాజమౌళిపై ఉన్న ఒకే ఒక నమ్మకంతో నేను సినిమాను అంగీకరించాను. స్క్రిప్టు ఏది అనిగానీ, కథ ఏంటనీ కూడా అడుగలేదు అని రాంచరణ్ అన్నారు.ఎన్టీఆర్‌తో కాంబినేషన్ అని అనగానే ఒప్పుకొన్నాను. మల్టీస్టారర్ చిత్రమంటే నాకు చాలా ఇష్టం. తారక్‌తో నటించడమంటే ఇంకా ఇష్టం. త్వరలోనే సినిమా కథను చెబుతానని రాజమౌళి ప్రామిస్ చేశారు అని చెర్రీ పేర్కొన్నారు.రాజమౌళిని గుడ్డిగా నమ్మాను. కథ, క్యారెక్టర్ ఎంత బలంగా రూపొందిస్తారో నాకు తెలుసు. అందుకే ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తకుండానే సినిమాను ఒకే చేశాను. అంతకుమించి ఆ సినిమా గురించి నాకు ఏమి తెలియదు అని రాంచరణ్ అన్నారు.

బాహుబలి తర్వాత రాజమౌళి రూపొందించే సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మేమంత ఇతర సినిమా వ్యవహారాలతో బిజీగా ఉన్నాం. మా ప్రాజెక్టులన్నీ ఆగస్టులోగా పూర్తవుతాయి. ఆ తర్వాత సినిమా యూనిట్‌తో కలుస్తాం. అక్టోబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది అని రాంచరణ్ తెలిపారు.కాగా, తన సినిమాకు సంబంధించిన టెస్ట్ షూట్‌ను అమెరికాలో నిర్వహించారు. అందుకోసం రాంచరణ్, ఎన్టీఆర్ యూఎస్‌కు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ వారికి కొన్ని రోజులపాటు వర్క్‌షాప్ కూడా నిర్వహించినట్టు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.రాంచరణ్ బర్త్ డే సందర్భంగా ఓ టీజర్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉండొచ్చనే వార్త కూడా వినిపిస్తున్నది. మార్చి 27న రాంచరణ్ తన 32వ జన్మదినాన్ని జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. ఒకవేళ రాజమౌళి ఈ సినిమా టీజర్ వెల్లడిస్తే మెగా ఫ్యాన్స్‌కు పండుగగా మారే అవకాశం ఉంది.

క్రీడా నేపథ్యంగా అంటే బాక్సింగ్ స్పోర్ట్ ఆధారంగా రాజమౌళి సినిమా రూపొందిస్తున్నారనే వార్త వినిపిస్తున్నది. ఈ చిత్రంలో రాంచరణ్, ఎన్టీఆర్ పోలీస్ అధికారులుగా నటిస్తున్నారు అనే వార్త చక్కర్లు కొడుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన మూడు ఆర్ ఆంగ్ల అక్షరాలతో కూడా పోస్టర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *